Pages

Sunday, November 24, 2013

అప్రస్తుత ప్రసంగం

అప్రస్తుత ప్రసంగం
అక్కడ చర్చ వేడిగా సాగుతోంది మధ్యలో కథలూ కాకరకాయలూ చెప్పొద్దనే మాటా వచ్చింది ।కథల సంగతేమో కానీ। కాకరకాయల మాటొచ్చేసరికి నేనూ ఎంటరైపోయా.... కాకరకాయ కూరంటే నాకిష్టం అన్నా .... టాపిక్ ఆపి వాళ్ళు నా వైపు చూశారు ।శ్రోతలు దొరికారుగా... కాకర వేపుడైతే ఇష్టం అన్నాను ।పులుసు పడదు వేపుడైతే ఒడియాల్లాగా బొరుగుల్లా కరకరలాడతాయ్ ... వాళ్ళు మొఖం పచ్చి కాకరకాయ తిన్నట్లు పెట్టారు। అది చూసి కాకర రసం సుగర్ వాళ్ళకి బాగా పని చేస్తుందట ... వంటగురించి తిండి గురించి అసలు తెలియని నాకు కూర గురించి ఏం తెలుస్తుంది నిజంగా నాకేం తెలియదు। నాకేం తెలీదు అంటే గుర్తుకొచ్చింది ।మొన్న ఒక హోటల్ కు వెళ్ళాను। పది రూపాయలు ఉప్మా అన్నాడు కౌంటర్ లో క్యాషియర్। భలే అనుకుని తినేసి హమ్మయ్య అనుకున్నా।
రెండ్రోజుల తర్వాత వెళ్తే 15 రూపాయలు ।రేటు పెరిగింది అన్నాడు। అబ్బో అనేసి తినేశాం( ఇంకో ఫ్రెండ్ తోపాటు)। పది ఉప్మా కి 15 ఉప్మా కి తేడా వుంది। 10 రూపాయలు దాంట్లో నాలుగు జీడి పప్పులున్నాయ్। రెండోసారి దాంట్లో అవీ లేవు అదేమిటో అంటే నాకేం తెలీదు అని కౌంటర్లో కుర్రాడు చెప్పాడు। చర్చల్లో ఉన్నవారికి అసహనం పెరుగుతోంది। అసహనం ఎందుకు వస్తుందంటే అని మొదలు పెట్టాను। తప్పదన్నట్టు ఫేస్ పెట్టారు। ఇష్టం లేకపోతే వస్తుంది। అలాగే అనుకున్నది జరగకుండా జరుగుతున్నట్లు అనిపిస్తుంటే కూడా వస్తుంది అన్నా। భరించలేక వేడి వేడి చర్చలు ఆపేసి తలనొప్పి తగ్గించుకునేందుకు టీ కోసం పరుగులు పెట్టారు।(ఇంకా వుంది )

Monday, November 11, 2013

సరదాగా

UNCLE PODGER HANGS A PICTURE
ఇది చిన్నప్పుడు ఇంగ్లీషు నాన్ డిటెయిల్ లో చదువుకున్న కథ పేరు। కథ చదువుకున్న రోజుల్లో గుర్తున్నంతగా ఇప్పుడు చెప్పలేను గానీ। స్థూలంగా మాత్రం చెప్పగలను। అంకుల్ పోడ్జర్ కథలో హీరో। కథంతా ఆయన చుట్టూ తిరుగుతుంది। ఆయనతో పాటు పిల్లలు ఉన్నా కథలో ఆయనే ప్రధానం। కథేమిటంటే పెద్ద ఇల్లు। దాంట్లో అంకుల్ పోడ్జర్ ఆయన పిల్లలు నివసిస్తుంటారు। ఒక రోజు ఆ ఇంట్లో హాల్లో గోడకు ఒక చిత్రపటం అందంగా అ�లంకరించాలని అంకుల్ అనుకుంటాడు। పిల్లలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు। తన ఫొటో తనే ఎలాగైనా గోడకి తగిలించాలని నిర్ణయించేస్తాడు। ఓ రోజు అంతా వెళ్ళాక మేకులూ సుత్తి సరంజామాతో ఫొటో గోడకు వేలాడతీసే కార్యక్రమం మొదలు పెడతాడు। ఫొటో బిగించడం మొదలు పెట్టగానే చేతి మీద సుత్తితో కొట్టుకుంటాడు। పాతగోడ కావడం తో మేకులు ఊడిపోతుంటాయి పటం జారి కిందపడుతుంది ।అన్నీ అడ్డంకులే । అయినా మొక్కవోని దీక్ష తో అంకుల్ పోడ్జర్ కృషి చేసి పటాన్ని గోడకు తగిలిస్తాడు। ఈలోగా పిల్లలు ఇంటికి చేరుకుంటారు ।వారిని చూసి విజయగర్వంతో నవ్వుతాడు। పిల్లలు గోడవైపు చూసి నవ్వుతారు। ఫ్రేమ్ విరిగిన ఒక ప్రక్కకు ఒరిగిపోయిన పటం గోడకు వేలాడుతుంది।
ఇది ఎందుకు గుర్తు వచ్చిందంటే సమైక్యాంధ్ర చిత్రపటాన్ని మోస్తున్న అశోక్ బాబును చూసి। అంకుల్ పోడ్జర్ ధ్యేయం గోడకు పటాన్ని ఎలాగో ఒకలాగ తగిలించడం ।అందుకు పటానికి ఆధారంగా గోడ ఎంచుకున్నాడు పగిలినా ఫ్రేం పటాన్ని అడ్డదిడ్డంగానైనా వేలాడదీసి గెలిచానని సంతృప్తి పడ్డాడు ।కానీ అశోక్ బాబు మాత్రం గోడ లేకుండా సమైక్య పటం పట్టుకునిదాన్ని వేలాడదీసేందుకు ఊరూరా తిరుగుతూ గాలిలో మేకులు కొట్టేస్తున్నాడు ।ఎన్నిసార్లు వేలు చితగ్గొట్టుకుంటారు। ఎన్ని రోజులకు పటం వేలాడదీస్తారూ ।??

Wednesday, November 6, 2013

శత దినోత్సవం


ఎందుకు విడుదలైందో తెలియదు గానీ చూస్తుండగానే శతదినోత్సవానికి సిద్ధం అయింది। విడుదల సమయంలో అభిమానులు సూపర్ డూపర్ హిట్ అనుకుని జయజయధ్వానాలు చేశారు।కేరింతలు కొట్టారు ।కన్నీళ్ళు పెట్టకున్నారు ।లేని హీరోని ఊహించుకుని తమకు తామే ఇంజక్ట్ చేసుకుని  కనబడుతున్న వ్యక్తులనే విలన్ లుగా భావించేసుకుని ఊగిపోయారు । వెనుతిరిగి చూస్తే హీరో లేడు విలన్ ఎవరో అనే సందేహం వచ్చింది। ఉసూరుమన్నారు। నీరసించారు। తమ అభిమాన సినిమా హీరో లేకుండా పది పదిహేను రోజులే ఆడిందన్న ఉక్రోషం వచ్చింది। శిబిరాలు వేశారు। అభిషేకాలు చేశారు। బొమ్మని మరో పది రోజులు పొడిగించారు। చదువు చట్టుబండలయింది। కూలీ లేకుండా పోయింది। ఆడని సినిమా కోసం మనం పాడుకావాలా అనే తిట్లూ దండకాలు ఇళ్ళలో మొదలయ్యాయి। మన సినిమా పరిస్థితి ఏంటి అన్న దగ్గర నుండి మన పరిస్థితి ఏమిటో అనే స్థితికి అభిమానులు చేరుకున్నారు। వారిపై చాలామంది సానుభూతి కురిపించారు।
ఇది సమైక్యాంధ్ర ఉద్యమం అనే గొప్ప సాంఘిక ఎమోషనల్  అన్సెన్సేషనల్ ఒరిజినల్ చిత్రరాజం మొదటి అంకం।
సాటివారి సినిమా నడవక చతికిలబడుతుంటే వారికీ బాధేసింది । ఎక్కడో పబ్లిసిటీ లోపం కనబడింది।  పదే పదే మేమున్నామని సమైక్య సినిమావాదుల్ని బుజ్జగిస్తూ లాలిపాటలు పాడుతున్న వారిపై కోపం వచ్చింది। మా సినిమా హిట్ కాబట్టి మీరు ఓడారు కలక్షన్ కనెక్షన్ లెక్క తేలాక మీ వాటా ఎంతో కొంత ముట్టజెబుతాం మీరు ఆ తర్వాత మూటా ముల్లె సర్దుకోవాలని పొరుగుసినిమా ప్రొడ్యూసర్ తెగేసి చెప్పేశారు। అలా అంటే కాస్తంత కాలింది ముందుగా సమైక్య సినిమా ఉద్యోగులకే। పొరుగాయన అలా అంటే ఊరుకోం భద్రత ఇచ్చేదాకా పనికి రాం రాం అన్నారు ।దీంతో సమైక్య సినిమా పై ఆశ కలిగింది అభిమానులు అందరికీ ....
ఆఫీసులు మూసేశారు। తాళాలు వేసేశారు ।మీటింగులెట్టి సినిమా ఆడకపోతే వచ్చే
వచ్చే నష్టాలపై ఏకరవు పెట్టారు। అంతా దీన్ని హిట్ చేయాలన్నారు। జాతీయగీతాలు పాడారు। పురాణ ప్రవచనాలను అందించారు। రెండు నెలల ఈ ప్రచారం లో సినిమాకు కొత్త హీరో దొరికాడు।
ఇది సమైక్యసినీమాలో రెండోఅంకం ।
గత కాలంలో ।ఓ మంచి సినిమా వస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యార్థులకూ చూపించేందుకు వాహనసౌకర్యం నిర్వాహకులు కల్పించేవారు। అయితే సమైక్య సినిమా చూపించేందుకు సినిమా అభిమాన ఛానళ్ళు వచ్చాయి కాబట్టి మా బస్సులతో పని లేదని ఆ  సిబ్బంది బస్సు దిగిపోయారు । ప్రచారంలో ఉన్న సమైక్య సిబ్బందితో చేతులు కలిపారు। ఎక్కడి వారక్కడే। ఇళ్ళలో జనం ఇళ్ళలోనే... పెళ్ళి జనం పందిళ్ళలోనే।
సినిమా హిట్ అనే వరకూ మడం తిప్పం అంటూ హూంకరించారు। ఊరూరా బంద్ చేశారు ।
ఇది సమైక్యం మూడో అంకం  
ఇంత జరుగుతున్నా ఎటునుంచీ కూడా హిట్ అన్న మాట రాలేదు ।ఈ సినిమా అభిమాన చానళ్ళు పదేపదే చూపించినా చప్పట్లు కొట్టడమే గానీ హిట్ అవుతుందన్న వారు కానరాలేదు। దీంతో ఒళ్ళు మండిన ప్రొడక్షన్ గ్రూపులో లైటింగ్ విభాగం ఫీజులు పీకేసింది। బ్లాక్ అండ్ వైట్ అయినా హిట్టయ్యేదాకా ఊరుకోం అని భీష్మించేశారు। ఇక్కడ కొంత పని జరిగింది। సినిమా కి ప్రభుత్వ స్థాయిలో మద్దతు వచ్చింది। చర్చలు మొదలయ్యాయి। ఫెయిల్ ... మళ్ళీ మొదలు।  దఫదఫాల చర్చల అనంతరం లైటు వెలిగించారు।
ఇదే సినిమా లో పట్టు పెంచిన నాలుగో అంకం।
సమైక్య హీరో ఐక్యతా గీతం పాడుతూనే ఉన్నాడు। హీరో పేరు మారుమోగింది। అభినందనలూ। కొత్తకొత్త లొకేషన్లు। చప్పట్లు జైనినాదాలు సినిమా బాక్సు కాస్తా మినియేచర్ కెమెరా లో చిక్కుబడింది ।హీరో కొండంత ఎత్తుకు ఎదిగాడు। అతని వెనక నడిచిన వారికి ఇంట్లో తిప్పలు బైట అప్పులు మిగిలాయి ।వారి మనసులో భావం అర్థం చేసుకుని ప్రచారం ఆపి పనుల్లో కి వెళ్ళేందుకు వీలుగా అందరికీ దుఃఖదాయిని వారికి ఆపద్బాంధవి తుపానుగా వచ్చింది । మనషులం కాబట్టి సాయం చేసేందుకు ప్రచారోద్యమం ఆపేస్తున్నామని కొత్త హీరో ప్రకటించారు। అవసరం అయితే మళ్ళీ రంగు వేసుకుంటామని హెచ్చరించారు। అభిమానులు మరింతగా కుంగిపోతూనే వేరుశనగ కాయలూ సీతాఫలాలతో కడుపు నింపుకుని హిట్ చేసేందుకు ఉద్యమం ఉథృతంగా చేస్తున్నట్లు అభిమాన చానళ్ళు పదేపదే ప్రసారం చేస్తున్నాయి। ఇది సమైక్య సినిమా ఆఖరి అంకం ।అయితే ఈ సినిమా ఇంకా ఉంది। హీరో। విలన్ కమెడియన్ హీరోయిన్ కారెక్టర్ యాక్టర్ తదితరాలు లేకుండా పూర్తి కాని ప్రచార ఘట్టంలోనే విడుదలై 7వ తేదీకి నూరు రోజుల వేడుకలకు సిద్ధం అయింది। ఇది నిజంగా ప్రపంచ రికార్డు అని ప్రచారం। శత దినోత్సవ వేడుకని బంద్ తోనూ దారుల దిగ్బంధనతోనూ జరుపుకోవాలని కొందరు పేరు తెచ్చుకుంటున్న నటులు నిర్ణయం చేశారు।

Tuesday, November 5, 2013

అతీతం

నీరింకిన కళ్ళతో నువ్వు
కన్నీటి తో నేను
అర్థాకలితో నేను
ఆకలితో నువ్వు
ఓదారుస్తూ నీవే
మౌనంగా రోదిస్తూ నీవే
కష్టం సుఖం వేదన రోదన అన్నీ నువ్వే।
అంతటికీ అతీతంగా నువ్వే ।
-- రామచంద్ర శర్మ , గుండిమెడ 5/11/2013

Friday, October 18, 2013

స్వామి వారి స్వప్న వృత్తాంతం

కలలు కనండి ... వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి ... అని పెద్దాయన మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం యువతకు పిలుపునిచ్చారు గతంలో .... వర్తమానంలో యువత అలా కలలు కంటోందో లేదో గానీ। సాధూమహరాజ్ లు మాత్రం తెగ కలలు కనేస్తున్నారు। సాధువులు స్వాములు అంటే దైవ సాన్నిధ్యంలో ధ్యానం చేస్తూ మానవులకు సక్రమ మార్గంలో జీవనం సాగించేందుకు బోధనలు చేస్తరని ఇప్పటి వరకూ అనుకున్నా ... కానీ వారు కూడా కలలు కంటారనిన్నీ, ఆ కలల్లో దేవుడికి బదులుగా మరకత మాణిక్యాలూ వజ్రవైఢూర్యాలు స్వర్ణఖచిత సింహాసనాలూ పట్టు పీతాంబరాలూ దర్శనం ఇస్తాయని తాజాగా తెలిసి ఆశ్చర్యం వేసింది। సదరు స్వామి వారికి కల రావడం ఆ స్వప్న వృత్తాంతం రాజావార్ల చెవిన పడడం జరిగిపోయింది।  సాధుజన స్వప్నవృత్తాంతం విన్న రాజావారు వెంటనే నిధినిక్షేపాల వేటలో నిష్ణాతులయిన సిబ్బందిని రంగంలో దించేశారు । వారంతా చెమటోడ్చి కనబడిన చోటల్లా తవ్వుకుంటూ పోతున్నారు।
ఈ వివరం తెలిశాక నాకు అర్ధం అయిన నీతి ఏమంటే రాజ్య ప్రజలు యావన్మంది పని పాటలు మానేసి తిండీ తిప్పలు వదిలేసి కలలు కనండి .... నిధినిక్షేపాలు కలలో కనబడితే రాజావారికి చెప్పండి। పైసా ఖర్చు లేకుండా ఇళ్ళన్నీ తవ్వించేస్తారు। కల నిజం అయిందా ఒళ్ళంతా బంగారమే। కాదంటే తవ్విన గోతులు భవిష్యత్తులో మీకే పనికొస్తాయి।

ఎడబాటు


నీకు నేనంటే ఇష్టమని తెలుసు
వేకువ నుండీ నాకోసం ఎదురు చూస్తావనీ తెలుసు।
నేవచ్చే సరికి పడమటి సంధ్యల్లో ఒదిగిపోతావు
ఈ ఎడబాటు ఏకాంతవాసం
మనకింకెన్నాళ్ళు?
-రామచంద్ర శర్మ గుండిమెడ 17/10/2013

Monday, September 2, 2013

జీవన చిత్రం

ఇది ఏడాది క్రితం రాసుకున్నాను. గతంలో ఎఫ్ బి లో పోస్ట్ చేశాను. మా బాబాయి గుండిమెడ కేశవరామయ్య గారు మెచ్చుకుని అప్పట్లో తన టైం లైన్ లో షేర్ చేసుకున్నారు... ఇప్పుడు ఆయన లేరు .. ఇది మిగిలింది.

జీవన చిత్రం

విరిసీ విరియని మొగ్గ
సిగ్గు దొంతరల మధ్య మెరుపు
చిరునవ్వు

ముసురుపట్టిన మబ్బు
తడపలేని జల్లు
కన్నీరు

చిరునవ్వూ కన్నీరూ
సమాంతర రేఖా ప్రవాహం
జీవన చిత్రం

రామచంద్ర శర్మ గుండిమెడ (02/09/2013)

Saturday, August 31, 2013

హక్కులు బాధ్యతలు


ఏమో ఎమిటో చెబుతున్నా అర్ధం కాకున్నా
మేం ఏదో బతికేస్తున్నాం ... హక్కులే
లేనప్పుడు బాధ్యతలేం ఉంటాయ్...
దేనికీ మీదీ కాదు . మాదీ కాదు బాధ్యత...
ఎవడో వచ్చి పక్కలో బాంబు వేసిపోతాడు.. పొరుగున ఉన్న
పాకిస్తాన్ వాడు ఏమీ తోచక కాల్పులు జరిపేస్తాడు...
సరిహద్దుల్లో మన జవాన్ల తలలు తెగ నరుకుతాడు... ఈపక్క
నుండి
చైనా వాడు మనింట్లోకి జొరబడతాడు...
నిన్న మొన్నటి దాక ఉద్యమాలతో బెదిరి చెదిరిన
మయన్మార్ వాడు మన నేలపై గుడారం వేస్తాడు
అయినా బాధ్యత
మనది కాదు....
మీరు తినే రోటికి
పిండి కరవైనా...
మేం తినే గంజీ
మెతుకుల్ని బహుళ జాతి వాడి
మాల్ లూ తల తాకట్టు పెట్టి కొన్నా బాధ్యత మీది కాదు .. మాదీ
కాదు...
సిరియానో లేకుంటే ఒబామానో
అదీ కాదంటే. ప్రపంచ బ్యాంకి వాడూ ఫెడరల్ బాంకి వాడో మన
బాధ్యత
తీసుకుంటారు లేండి కంగారెందుకు...
హక్కులు లేని
చోట బాధ్యతలు ఉండవు కదా
మళ్ళీ బానిసత్వ ప్రాప్తి పొందుదాం...
అప్పుడు హక్కులూ గుర్తొస్తాయ్ ..బాధ్యతా తెలిసొస్తుంది..
(కేంద్ర మంత్రి పవార్ ఉల్లిపాయ ధర పెరిగుదలపై ఇచ్చిన
ప్రకటనకు అనుగుణంగానే)
-- రామ చంద్ర శర్మ గుండిమెడ 31/08/2013

Saturday, August 24, 2013

పిచ్చి రాతలు

ఈ ఆకాశం నీలంగా ఎందుకుందీ
తెల్లగా ఉంటే బాగోదు కనుక
వానలు ఎందుకు కురవడం లేదు
కురిస్తే పంటలు పండుతాయి కనుక
పంటలు ఎందుకు ఎండుతున్నాయి
జనం మల మలా మాడాలి కనుక
ప్రభుత్వం నీళ్ళివ్వదు ఎందుకని
పౌరులు ప్రశాంతంగా ఉండకూదదు కనుక
రాజధాని మీదే గొడవ ఎందుకని
మిగిలిన విషయాలు పక్కన పెట్టొచ్చు కనుక
ఉద్యమాలు దేనికి
పనికి ఆహార పధకం అమలు అవుతుంది కనుక
పత్రికలు ఉద్యమాలే ఎందుకు రాస్తుంటాయి...
జనఘోష పనికి మాలింది కనుక
(హైదరబాద్ మీదే అంతా మాట్లాడ్తున్నందున విషయం ఏమిటొ అర్ధం కాని సామాన్యుడి
ఘోష కు పిచ్చి అక్షరాల కూర్పు)

Thursday, August 15, 2013

నిశ్శబ్దం

చీకట్లు కమ్ముకున్నాయ్...
ఎటుచూసినా స్మశాన నిశ్శబ్దమే...
ఏమిటో తెలీని భయాలు...
ఈ చీకటి చెదిరిపోతుందనేమో...
ఈ నిశ్శబ్దం ఎంత హాయిగా ఉందీ
ఈ చీకట్లు ఇలానే ఉండనీ
చెదిరిపోనీయకు...
ఒడిసి పట్టుకో...
నిద్ర ఆపైనా ఇలానే..
జారిపోతే మళ్ళీ దొరకదు..
మెల్లగా దానికీ జోల పాడు...
చీకటితో సహచర్యం చేసే నిశ్శబ్దం అలానే ఉంటుంది
ష్.. చప్పుడు చేయకు
పారిపోతుంది
ఈ కాసేపైనా.  నిశ్శబ్దంగా ఉండనీ
మళ్ళీ  మామూలేగా తిట్లూ దీవెనలూ
నిట్టూర్పులూ...  బతుకు సమరాలూ...
-రామ చంద్ర శర్మ గుండిమెడ
(15 ఆగస్ట్ 2013)

Saturday, June 15, 2013

శ్రీశ్రీ మరణం ఓ విషాదం

జూన్ 15, 1983
తిరుపతి... ఈనాడు కార్యాలయం
రాత్రి 7 గంటలు అయింది. నేను టెలిప్రింటర్ సెక్షన్ లో ఆపరేటర్ గా డ్యూటీలో ఉన్నాను. మొదటి  షిఫ్ట్ అయిపోయిన సబ్ ఎడిటర్లు ఇళ్ళకి వెళ్ళేందుకు సిధ్ధంగా ఉన్నారు.
ఆ టైంలో విజయవాడ ఆఫీస్ నుండి  టెలిప్రింటర్ ద్వారా మెసేజి వచ్చింది . నాలుగు లైన్ల మేసేజ్ అది. శ్రీశ్రీ గారు చనిపోయారట. చలసాని ప్రసాద్ గారు ఫోన్  చేసి చెప్పారు. మద్రాస్ నుండి వార్త అడగండి.
అది మఫిషల్ డెస్క్ ను ఉద్దేశించి ఇచ్చింది.ఆ మేసేజ్ తీసుకుని డెస్క్ కు వెళ్తుంటే తాడి ప్రకాష్ గారుఆయన సహచరులు మెట్లు దిగుతున్నారు. వెంటనే  ప్రకాష్ గారూ అని పిలిచాను. ఏంటి శర్మా అని ఆయన అడగ్గానే.... శ్రి శ్రి గారు పోయారట... వార్త ఇవ్వమని విజయవాడ డెస్క్ అడుగుతోంది అన్నాను. రెండు అంగల్లో ఆయన 10 మెట్లు ఎక్కి నా దగ్గరకు చాలా ఉద్వేగంగా కాస్త కోపంగా వచ్చారు. ఎవరు చెప్పారట అని అడిగారు... తెలీదు సర్... చలసాని ప్రసాద్ గారు ఫోన్ చేశారని మెసేజిలో ఉందని మేసేజ్ చూపించాను. వెంటనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆయన వెనక  వెళ్తున్న దాట్ల నారాయణ  మూర్తిరాజు గారు , నామిని సుబ్రమణ్యం నాయుడు, మురళి మోహన్ పిళ్ళై ఇంకా ఒకరిద్దరూడెస్క్ లోకి వచ్చారు. అందరూ చాలా విషాదంగానే ఉన్నారు. అప్పుడు జనరల్ డెస్క్ఇన్ ఛార్జ్ ఎస్ రామశేషు గారు ప్రకాష్ పరిస్థితి చూసి డ్యూటీ అప్పగించి వేరే పేజీలు చూస్తున్నారు. 8 గంటలకు న్యూస్ టుడే డెస్క్ లో కూర్చుని ప్రకాష్ వార్త రాయడం మొదలు పెట్టారు ।అప్పటి మఫిషిల్ డెస్క్ ఇన్ ఛార్జ్ నవీన్ గారు కూడా ఉన్నారు। అప్పటి వరకూ ఉన్న ప్రశాంతత ఎగిరి పోయింది
ఓ విషాదం ... ఓ ఉద్వేగం... ఓ బాధ ... అక్కడున్న వారందరి ముఖాల్లో కనబడ్డాయి.... ఈలోగా శ్రీశ్రీ రచనలూ పుస్తకాలను ఎవరో తీసుకుని వచ్చారు।  అదే సమయంలో  ఈదురుగాలి... కరెంటు పోయింది... బయిట వాన మొదలైంది..  దాట్ల కొవ్వొత్తి వెలిగించమంటె వెలిగించాను... శ్రి శ్రి పుస్తకం ఒకటి తీసుకుని  ఆ కొవ్వొత్తి కాంతిలో నేను ఒక్కో పేజి దాట్ల కు చూపిస్తుంటె ఆయన రాసుకున్నారు... నామిని లేచి పక్క డెస్క్ కు వెళ్ళి ఓ నిమిషం లో వార్త రాసుకొచ్చారు... శ్రీశ్రీ  మరణం తట్టుకోలేక  ఆకాశం భోరున విలపిస్తూందనే వార్త చూసి ప్రకాష్ వెంటనే కంపోజ్ కు పంపారు. ఈలోగా ఆరుద్ర గారికి ట్రంకాల్  బుక్ చేయమంటే నంబరు రాసుకుని ఆపరేటర్ కు చెప్పాను।  కాల్ విషయం ఎవరికీ గుర్తులేదు. ఫ్రంట్ పేజీ డెడ్ లైన్ అవుతోంది .ఈలోగా ఆరుద్రగారి కాల్ వచ్చింది .  ప్రకాష్ ఆయనతో మాట్లాడి వార్త ఇచ్చారు। అదే సమయంలో హైదరాబాద్ నుంచి మెసేజ్ .  ఎట్టి పరిస్థితిలోనూ మాస్ట్ హెడ్ (ఈనాడులోగో) దించవద్ధని ఆదేశం.  పేజీ పూర్తి అయ్యింది. హెడ్ లైన్ ఇవ్వాలి బేనర్ కు. అప్పటి దాకా చూస్తూ ఉన్న రామశేషు గారికి ప్రకాష్ సారీ మీ డ్యూటీ నేను చేసేశాను అన్నారు ।దానికి ఆయన నవ్వి మీ ఆవేదన। చూసి మీకు అప్పగించాను అన్నారు। బేనరు హెడ్డింగు  శ్రిశ్రి మహా ప్రస్థానం అని పెట్టారు। ఇది జనాలకు అర్థం అవుతుందా అని ప్రకాష్ అడిగితే శ్రీశ్రీ ఎవరో తెలిస్తే అదీ అర్థం అవుతుంది అని రామ శేషుగారు అన్నారు। ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేవరకూ అక్కడే ఉండడంతో నాకు ఇన్నీ తెలిసాయి। అప్పటిదాకా శ్రీశ్రీ గురించి నాకు పెద్దగాతెలియదు। ఆ తర్వాతే  చదవడం మొదలెట్టాను.  అన్నీ కాదు కొన్నే చదివా..  చదివినంత సేపూ కాస్త ఆవేశం వచ్చేది ।
ఆ వార్తను అన్ని ఎడిషన్లకు క్రీడ్  చెయ్యమంటే నా కొలీగ్  ఆర్ సత్యనారాయణ మూర్తి చొరవ తీసుకుని నేను పంపుతాను అని మొత్తం క్రీడ్ చేశారు ।  సుమారు 25 పేజీలు రాసినట్లున్నారు ।మరుసటి రోజు  ఉదయాన్నీ పేపర్లో  అర పేజ్ వచ్చింది.