Pages

Wednesday, November 6, 2013

శత దినోత్సవం


ఎందుకు విడుదలైందో తెలియదు గానీ చూస్తుండగానే శతదినోత్సవానికి సిద్ధం అయింది। విడుదల సమయంలో అభిమానులు సూపర్ డూపర్ హిట్ అనుకుని జయజయధ్వానాలు చేశారు।కేరింతలు కొట్టారు ।కన్నీళ్ళు పెట్టకున్నారు ।లేని హీరోని ఊహించుకుని తమకు తామే ఇంజక్ట్ చేసుకుని  కనబడుతున్న వ్యక్తులనే విలన్ లుగా భావించేసుకుని ఊగిపోయారు । వెనుతిరిగి చూస్తే హీరో లేడు విలన్ ఎవరో అనే సందేహం వచ్చింది। ఉసూరుమన్నారు। నీరసించారు। తమ అభిమాన సినిమా హీరో లేకుండా పది పదిహేను రోజులే ఆడిందన్న ఉక్రోషం వచ్చింది। శిబిరాలు వేశారు। అభిషేకాలు చేశారు। బొమ్మని మరో పది రోజులు పొడిగించారు। చదువు చట్టుబండలయింది। కూలీ లేకుండా పోయింది। ఆడని సినిమా కోసం మనం పాడుకావాలా అనే తిట్లూ దండకాలు ఇళ్ళలో మొదలయ్యాయి। మన సినిమా పరిస్థితి ఏంటి అన్న దగ్గర నుండి మన పరిస్థితి ఏమిటో అనే స్థితికి అభిమానులు చేరుకున్నారు। వారిపై చాలామంది సానుభూతి కురిపించారు।
ఇది సమైక్యాంధ్ర ఉద్యమం అనే గొప్ప సాంఘిక ఎమోషనల్  అన్సెన్సేషనల్ ఒరిజినల్ చిత్రరాజం మొదటి అంకం।
సాటివారి సినిమా నడవక చతికిలబడుతుంటే వారికీ బాధేసింది । ఎక్కడో పబ్లిసిటీ లోపం కనబడింది।  పదే పదే మేమున్నామని సమైక్య సినిమావాదుల్ని బుజ్జగిస్తూ లాలిపాటలు పాడుతున్న వారిపై కోపం వచ్చింది। మా సినిమా హిట్ కాబట్టి మీరు ఓడారు కలక్షన్ కనెక్షన్ లెక్క తేలాక మీ వాటా ఎంతో కొంత ముట్టజెబుతాం మీరు ఆ తర్వాత మూటా ముల్లె సర్దుకోవాలని పొరుగుసినిమా ప్రొడ్యూసర్ తెగేసి చెప్పేశారు। అలా అంటే కాస్తంత కాలింది ముందుగా సమైక్య సినిమా ఉద్యోగులకే। పొరుగాయన అలా అంటే ఊరుకోం భద్రత ఇచ్చేదాకా పనికి రాం రాం అన్నారు ।దీంతో సమైక్య సినిమా పై ఆశ కలిగింది అభిమానులు అందరికీ ....
ఆఫీసులు మూసేశారు। తాళాలు వేసేశారు ।మీటింగులెట్టి సినిమా ఆడకపోతే వచ్చే
వచ్చే నష్టాలపై ఏకరవు పెట్టారు। అంతా దీన్ని హిట్ చేయాలన్నారు। జాతీయగీతాలు పాడారు। పురాణ ప్రవచనాలను అందించారు। రెండు నెలల ఈ ప్రచారం లో సినిమాకు కొత్త హీరో దొరికాడు।
ఇది సమైక్యసినీమాలో రెండోఅంకం ।
గత కాలంలో ।ఓ మంచి సినిమా వస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యార్థులకూ చూపించేందుకు వాహనసౌకర్యం నిర్వాహకులు కల్పించేవారు। అయితే సమైక్య సినిమా చూపించేందుకు సినిమా అభిమాన ఛానళ్ళు వచ్చాయి కాబట్టి మా బస్సులతో పని లేదని ఆ  సిబ్బంది బస్సు దిగిపోయారు । ప్రచారంలో ఉన్న సమైక్య సిబ్బందితో చేతులు కలిపారు। ఎక్కడి వారక్కడే। ఇళ్ళలో జనం ఇళ్ళలోనే... పెళ్ళి జనం పందిళ్ళలోనే।
సినిమా హిట్ అనే వరకూ మడం తిప్పం అంటూ హూంకరించారు। ఊరూరా బంద్ చేశారు ।
ఇది సమైక్యం మూడో అంకం  
ఇంత జరుగుతున్నా ఎటునుంచీ కూడా హిట్ అన్న మాట రాలేదు ।ఈ సినిమా అభిమాన చానళ్ళు పదేపదే చూపించినా చప్పట్లు కొట్టడమే గానీ హిట్ అవుతుందన్న వారు కానరాలేదు। దీంతో ఒళ్ళు మండిన ప్రొడక్షన్ గ్రూపులో లైటింగ్ విభాగం ఫీజులు పీకేసింది। బ్లాక్ అండ్ వైట్ అయినా హిట్టయ్యేదాకా ఊరుకోం అని భీష్మించేశారు। ఇక్కడ కొంత పని జరిగింది। సినిమా కి ప్రభుత్వ స్థాయిలో మద్దతు వచ్చింది। చర్చలు మొదలయ్యాయి। ఫెయిల్ ... మళ్ళీ మొదలు।  దఫదఫాల చర్చల అనంతరం లైటు వెలిగించారు।
ఇదే సినిమా లో పట్టు పెంచిన నాలుగో అంకం।
సమైక్య హీరో ఐక్యతా గీతం పాడుతూనే ఉన్నాడు। హీరో పేరు మారుమోగింది। అభినందనలూ। కొత్తకొత్త లొకేషన్లు। చప్పట్లు జైనినాదాలు సినిమా బాక్సు కాస్తా మినియేచర్ కెమెరా లో చిక్కుబడింది ।హీరో కొండంత ఎత్తుకు ఎదిగాడు। అతని వెనక నడిచిన వారికి ఇంట్లో తిప్పలు బైట అప్పులు మిగిలాయి ।వారి మనసులో భావం అర్థం చేసుకుని ప్రచారం ఆపి పనుల్లో కి వెళ్ళేందుకు వీలుగా అందరికీ దుఃఖదాయిని వారికి ఆపద్బాంధవి తుపానుగా వచ్చింది । మనషులం కాబట్టి సాయం చేసేందుకు ప్రచారోద్యమం ఆపేస్తున్నామని కొత్త హీరో ప్రకటించారు। అవసరం అయితే మళ్ళీ రంగు వేసుకుంటామని హెచ్చరించారు। అభిమానులు మరింతగా కుంగిపోతూనే వేరుశనగ కాయలూ సీతాఫలాలతో కడుపు నింపుకుని హిట్ చేసేందుకు ఉద్యమం ఉథృతంగా చేస్తున్నట్లు అభిమాన చానళ్ళు పదేపదే ప్రసారం చేస్తున్నాయి। ఇది సమైక్య సినిమా ఆఖరి అంకం ।అయితే ఈ సినిమా ఇంకా ఉంది। హీరో। విలన్ కమెడియన్ హీరోయిన్ కారెక్టర్ యాక్టర్ తదితరాలు లేకుండా పూర్తి కాని ప్రచార ఘట్టంలోనే విడుదలై 7వ తేదీకి నూరు రోజుల వేడుకలకు సిద్ధం అయింది। ఇది నిజంగా ప్రపంచ రికార్డు అని ప్రచారం। శత దినోత్సవ వేడుకని బంద్ తోనూ దారుల దిగ్బంధనతోనూ జరుపుకోవాలని కొందరు పేరు తెచ్చుకుంటున్న నటులు నిర్ణయం చేశారు।

No comments: