Pages

Wednesday, January 29, 2014

ఒంటరి

జలజలా కురుస్తోంది కన్నిటి వాన
కన్నీరే  మున్నీరవుతోంది
వ్యధాభరిత జీవితపాశులు
ఆనందానుభూతులే జీవితమైనవాళ్ళు
ఎవరైనా ఒకటే
పశుపక్ష్యాదులకూ అది నేస్తం
మానవ జాతికే విచిత్ర చుట్టం
కన్నీటి చుక్క
అదిమిన కొద్దీ ఉబుకుతోంది 
పిపీలకాల్లాంటి మనుషుల్లో దాగివున్న మహార్ణవమది
ఒకప్పుడు దానికీ విలువుంది 
చుక్కరాలితే ఒకటే ఖంగారు , భయం
ఆ వెంటే ఓదార్పులు, నిట్టూర్పులూ
ఆ క్షణాన దానికి అందరూ ఆప్త మితృలే
గతం గతః
ఇపుడంతా స్మశాన నిశ్శబ్దమే

కన్నీటి చుక్క జారుతుంటే 
బుగ్గలు తడిసి పెదాలకు ఉప్పగా తగిలినా 
ఎవరికీ పట్టదు
బొట్టు బొట్టూ రాలుస్తూ

కాల్వలూ నదీనదాలు కడ్తున్నా
చూసేవారు లేరు 
మానవజాతి పుట్టిన నాటి నుండీ 
పొంగుతున్న ఆ చుక్క 
ఈ వస్తువాద ప్రపంచంలో 
పాపం యిపుడు ఒంటరిది

దానికి ఓదార్పే కరవు
-- గుండిమెడ రామచంద్ర శర్మ 
4/2/2008 


No comments: