Pages

Saturday, June 15, 2013

శ్రీశ్రీ మరణం ఓ విషాదం

జూన్ 15, 1983
తిరుపతి... ఈనాడు కార్యాలయం
రాత్రి 7 గంటలు అయింది. నేను టెలిప్రింటర్ సెక్షన్ లో ఆపరేటర్ గా డ్యూటీలో ఉన్నాను. మొదటి  షిఫ్ట్ అయిపోయిన సబ్ ఎడిటర్లు ఇళ్ళకి వెళ్ళేందుకు సిధ్ధంగా ఉన్నారు.
ఆ టైంలో విజయవాడ ఆఫీస్ నుండి  టెలిప్రింటర్ ద్వారా మెసేజి వచ్చింది . నాలుగు లైన్ల మేసేజ్ అది. శ్రీశ్రీ గారు చనిపోయారట. చలసాని ప్రసాద్ గారు ఫోన్  చేసి చెప్పారు. మద్రాస్ నుండి వార్త అడగండి.
అది మఫిషల్ డెస్క్ ను ఉద్దేశించి ఇచ్చింది.ఆ మేసేజ్ తీసుకుని డెస్క్ కు వెళ్తుంటే తాడి ప్రకాష్ గారుఆయన సహచరులు మెట్లు దిగుతున్నారు. వెంటనే  ప్రకాష్ గారూ అని పిలిచాను. ఏంటి శర్మా అని ఆయన అడగ్గానే.... శ్రి శ్రి గారు పోయారట... వార్త ఇవ్వమని విజయవాడ డెస్క్ అడుగుతోంది అన్నాను. రెండు అంగల్లో ఆయన 10 మెట్లు ఎక్కి నా దగ్గరకు చాలా ఉద్వేగంగా కాస్త కోపంగా వచ్చారు. ఎవరు చెప్పారట అని అడిగారు... తెలీదు సర్... చలసాని ప్రసాద్ గారు ఫోన్ చేశారని మెసేజిలో ఉందని మేసేజ్ చూపించాను. వెంటనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆయన వెనక  వెళ్తున్న దాట్ల నారాయణ  మూర్తిరాజు గారు , నామిని సుబ్రమణ్యం నాయుడు, మురళి మోహన్ పిళ్ళై ఇంకా ఒకరిద్దరూడెస్క్ లోకి వచ్చారు. అందరూ చాలా విషాదంగానే ఉన్నారు. అప్పుడు జనరల్ డెస్క్ఇన్ ఛార్జ్ ఎస్ రామశేషు గారు ప్రకాష్ పరిస్థితి చూసి డ్యూటీ అప్పగించి వేరే పేజీలు చూస్తున్నారు. 8 గంటలకు న్యూస్ టుడే డెస్క్ లో కూర్చుని ప్రకాష్ వార్త రాయడం మొదలు పెట్టారు ।అప్పటి మఫిషిల్ డెస్క్ ఇన్ ఛార్జ్ నవీన్ గారు కూడా ఉన్నారు। అప్పటి వరకూ ఉన్న ప్రశాంతత ఎగిరి పోయింది
ఓ విషాదం ... ఓ ఉద్వేగం... ఓ బాధ ... అక్కడున్న వారందరి ముఖాల్లో కనబడ్డాయి.... ఈలోగా శ్రీశ్రీ రచనలూ పుస్తకాలను ఎవరో తీసుకుని వచ్చారు।  అదే సమయంలో  ఈదురుగాలి... కరెంటు పోయింది... బయిట వాన మొదలైంది..  దాట్ల కొవ్వొత్తి వెలిగించమంటె వెలిగించాను... శ్రి శ్రి పుస్తకం ఒకటి తీసుకుని  ఆ కొవ్వొత్తి కాంతిలో నేను ఒక్కో పేజి దాట్ల కు చూపిస్తుంటె ఆయన రాసుకున్నారు... నామిని లేచి పక్క డెస్క్ కు వెళ్ళి ఓ నిమిషం లో వార్త రాసుకొచ్చారు... శ్రీశ్రీ  మరణం తట్టుకోలేక  ఆకాశం భోరున విలపిస్తూందనే వార్త చూసి ప్రకాష్ వెంటనే కంపోజ్ కు పంపారు. ఈలోగా ఆరుద్ర గారికి ట్రంకాల్  బుక్ చేయమంటే నంబరు రాసుకుని ఆపరేటర్ కు చెప్పాను।  కాల్ విషయం ఎవరికీ గుర్తులేదు. ఫ్రంట్ పేజీ డెడ్ లైన్ అవుతోంది .ఈలోగా ఆరుద్రగారి కాల్ వచ్చింది .  ప్రకాష్ ఆయనతో మాట్లాడి వార్త ఇచ్చారు। అదే సమయంలో హైదరాబాద్ నుంచి మెసేజ్ .  ఎట్టి పరిస్థితిలోనూ మాస్ట్ హెడ్ (ఈనాడులోగో) దించవద్ధని ఆదేశం.  పేజీ పూర్తి అయ్యింది. హెడ్ లైన్ ఇవ్వాలి బేనర్ కు. అప్పటి దాకా చూస్తూ ఉన్న రామశేషు గారికి ప్రకాష్ సారీ మీ డ్యూటీ నేను చేసేశాను అన్నారు ।దానికి ఆయన నవ్వి మీ ఆవేదన। చూసి మీకు అప్పగించాను అన్నారు। బేనరు హెడ్డింగు  శ్రిశ్రి మహా ప్రస్థానం అని పెట్టారు। ఇది జనాలకు అర్థం అవుతుందా అని ప్రకాష్ అడిగితే శ్రీశ్రీ ఎవరో తెలిస్తే అదీ అర్థం అవుతుంది అని రామ శేషుగారు అన్నారు। ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేవరకూ అక్కడే ఉండడంతో నాకు ఇన్నీ తెలిసాయి। అప్పటిదాకా శ్రీశ్రీ గురించి నాకు పెద్దగాతెలియదు। ఆ తర్వాతే  చదవడం మొదలెట్టాను.  అన్నీ కాదు కొన్నే చదివా..  చదివినంత సేపూ కాస్త ఆవేశం వచ్చేది ।
ఆ వార్తను అన్ని ఎడిషన్లకు క్రీడ్  చెయ్యమంటే నా కొలీగ్  ఆర్ సత్యనారాయణ మూర్తి చొరవ తీసుకుని నేను పంపుతాను అని మొత్తం క్రీడ్ చేశారు ।  సుమారు 25 పేజీలు రాసినట్లున్నారు ।మరుసటి రోజు  ఉదయాన్నీ పేపర్లో  అర పేజ్ వచ్చింది.