Pages

Tuesday, November 5, 2013

అతీతం

నీరింకిన కళ్ళతో నువ్వు
కన్నీటి తో నేను
అర్థాకలితో నేను
ఆకలితో నువ్వు
ఓదారుస్తూ నీవే
మౌనంగా రోదిస్తూ నీవే
కష్టం సుఖం వేదన రోదన అన్నీ నువ్వే।
అంతటికీ అతీతంగా నువ్వే ।
-- రామచంద్ర శర్మ , గుండిమెడ 5/11/2013

Friday, October 18, 2013

స్వామి వారి స్వప్న వృత్తాంతం

కలలు కనండి ... వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి ... అని పెద్దాయన మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం యువతకు పిలుపునిచ్చారు గతంలో .... వర్తమానంలో యువత అలా కలలు కంటోందో లేదో గానీ। సాధూమహరాజ్ లు మాత్రం తెగ కలలు కనేస్తున్నారు। సాధువులు స్వాములు అంటే దైవ సాన్నిధ్యంలో ధ్యానం చేస్తూ మానవులకు సక్రమ మార్గంలో జీవనం సాగించేందుకు బోధనలు చేస్తరని ఇప్పటి వరకూ అనుకున్నా ... కానీ వారు కూడా కలలు కంటారనిన్నీ, ఆ కలల్లో దేవుడికి బదులుగా మరకత మాణిక్యాలూ వజ్రవైఢూర్యాలు స్వర్ణఖచిత సింహాసనాలూ పట్టు పీతాంబరాలూ దర్శనం ఇస్తాయని తాజాగా తెలిసి ఆశ్చర్యం వేసింది। సదరు స్వామి వారికి కల రావడం ఆ స్వప్న వృత్తాంతం రాజావార్ల చెవిన పడడం జరిగిపోయింది।  సాధుజన స్వప్నవృత్తాంతం విన్న రాజావారు వెంటనే నిధినిక్షేపాల వేటలో నిష్ణాతులయిన సిబ్బందిని రంగంలో దించేశారు । వారంతా చెమటోడ్చి కనబడిన చోటల్లా తవ్వుకుంటూ పోతున్నారు।
ఈ వివరం తెలిశాక నాకు అర్ధం అయిన నీతి ఏమంటే రాజ్య ప్రజలు యావన్మంది పని పాటలు మానేసి తిండీ తిప్పలు వదిలేసి కలలు కనండి .... నిధినిక్షేపాలు కలలో కనబడితే రాజావారికి చెప్పండి। పైసా ఖర్చు లేకుండా ఇళ్ళన్నీ తవ్వించేస్తారు। కల నిజం అయిందా ఒళ్ళంతా బంగారమే। కాదంటే తవ్విన గోతులు భవిష్యత్తులో మీకే పనికొస్తాయి।

ఎడబాటు


నీకు నేనంటే ఇష్టమని తెలుసు
వేకువ నుండీ నాకోసం ఎదురు చూస్తావనీ తెలుసు।
నేవచ్చే సరికి పడమటి సంధ్యల్లో ఒదిగిపోతావు
ఈ ఎడబాటు ఏకాంతవాసం
మనకింకెన్నాళ్ళు?
-రామచంద్ర శర్మ గుండిమెడ 17/10/2013

Monday, September 2, 2013

జీవన చిత్రం

ఇది ఏడాది క్రితం రాసుకున్నాను. గతంలో ఎఫ్ బి లో పోస్ట్ చేశాను. మా బాబాయి గుండిమెడ కేశవరామయ్య గారు మెచ్చుకుని అప్పట్లో తన టైం లైన్ లో షేర్ చేసుకున్నారు... ఇప్పుడు ఆయన లేరు .. ఇది మిగిలింది.

జీవన చిత్రం

విరిసీ విరియని మొగ్గ
సిగ్గు దొంతరల మధ్య మెరుపు
చిరునవ్వు

ముసురుపట్టిన మబ్బు
తడపలేని జల్లు
కన్నీరు

చిరునవ్వూ కన్నీరూ
సమాంతర రేఖా ప్రవాహం
జీవన చిత్రం

రామచంద్ర శర్మ గుండిమెడ (02/09/2013)

Saturday, August 31, 2013

హక్కులు బాధ్యతలు


ఏమో ఎమిటో చెబుతున్నా అర్ధం కాకున్నా
మేం ఏదో బతికేస్తున్నాం ... హక్కులే
లేనప్పుడు బాధ్యతలేం ఉంటాయ్...
దేనికీ మీదీ కాదు . మాదీ కాదు బాధ్యత...
ఎవడో వచ్చి పక్కలో బాంబు వేసిపోతాడు.. పొరుగున ఉన్న
పాకిస్తాన్ వాడు ఏమీ తోచక కాల్పులు జరిపేస్తాడు...
సరిహద్దుల్లో మన జవాన్ల తలలు తెగ నరుకుతాడు... ఈపక్క
నుండి
చైనా వాడు మనింట్లోకి జొరబడతాడు...
నిన్న మొన్నటి దాక ఉద్యమాలతో బెదిరి చెదిరిన
మయన్మార్ వాడు మన నేలపై గుడారం వేస్తాడు
అయినా బాధ్యత
మనది కాదు....
మీరు తినే రోటికి
పిండి కరవైనా...
మేం తినే గంజీ
మెతుకుల్ని బహుళ జాతి వాడి
మాల్ లూ తల తాకట్టు పెట్టి కొన్నా బాధ్యత మీది కాదు .. మాదీ
కాదు...
సిరియానో లేకుంటే ఒబామానో
అదీ కాదంటే. ప్రపంచ బ్యాంకి వాడూ ఫెడరల్ బాంకి వాడో మన
బాధ్యత
తీసుకుంటారు లేండి కంగారెందుకు...
హక్కులు లేని
చోట బాధ్యతలు ఉండవు కదా
మళ్ళీ బానిసత్వ ప్రాప్తి పొందుదాం...
అప్పుడు హక్కులూ గుర్తొస్తాయ్ ..బాధ్యతా తెలిసొస్తుంది..
(కేంద్ర మంత్రి పవార్ ఉల్లిపాయ ధర పెరిగుదలపై ఇచ్చిన
ప్రకటనకు అనుగుణంగానే)
-- రామ చంద్ర శర్మ గుండిమెడ 31/08/2013

Saturday, August 24, 2013

పిచ్చి రాతలు

ఈ ఆకాశం నీలంగా ఎందుకుందీ
తెల్లగా ఉంటే బాగోదు కనుక
వానలు ఎందుకు కురవడం లేదు
కురిస్తే పంటలు పండుతాయి కనుక
పంటలు ఎందుకు ఎండుతున్నాయి
జనం మల మలా మాడాలి కనుక
ప్రభుత్వం నీళ్ళివ్వదు ఎందుకని
పౌరులు ప్రశాంతంగా ఉండకూదదు కనుక
రాజధాని మీదే గొడవ ఎందుకని
మిగిలిన విషయాలు పక్కన పెట్టొచ్చు కనుక
ఉద్యమాలు దేనికి
పనికి ఆహార పధకం అమలు అవుతుంది కనుక
పత్రికలు ఉద్యమాలే ఎందుకు రాస్తుంటాయి...
జనఘోష పనికి మాలింది కనుక
(హైదరబాద్ మీదే అంతా మాట్లాడ్తున్నందున విషయం ఏమిటొ అర్ధం కాని సామాన్యుడి
ఘోష కు పిచ్చి అక్షరాల కూర్పు)

Thursday, August 15, 2013

నిశ్శబ్దం

చీకట్లు కమ్ముకున్నాయ్...
ఎటుచూసినా స్మశాన నిశ్శబ్దమే...
ఏమిటో తెలీని భయాలు...
ఈ చీకటి చెదిరిపోతుందనేమో...
ఈ నిశ్శబ్దం ఎంత హాయిగా ఉందీ
ఈ చీకట్లు ఇలానే ఉండనీ
చెదిరిపోనీయకు...
ఒడిసి పట్టుకో...
నిద్ర ఆపైనా ఇలానే..
జారిపోతే మళ్ళీ దొరకదు..
మెల్లగా దానికీ జోల పాడు...
చీకటితో సహచర్యం చేసే నిశ్శబ్దం అలానే ఉంటుంది
ష్.. చప్పుడు చేయకు
పారిపోతుంది
ఈ కాసేపైనా.  నిశ్శబ్దంగా ఉండనీ
మళ్ళీ  మామూలేగా తిట్లూ దీవెనలూ
నిట్టూర్పులూ...  బతుకు సమరాలూ...
-రామ చంద్ర శర్మ గుండిమెడ
(15 ఆగస్ట్ 2013)