ఆ ఊరి పేరు వినగానే ఛప్పున చాలా విషయాలు స్ఫురణకు వచ్చేస్తాయి... చుట్టూ ఏరు ఊరును విడదీస్తూ మధ్యలో కృష్ణా గోదావరి కాల్వలు ఒకవైపు గ్రాండ్ ట్రంక్ రోడ్డు.... అతి పెద్ద ఓవర్‌బ్రడ్జి గుర్తుకు వస్తాయి. మధ్యలో కృష్ణ కాల్వపై వున్న కర్రల వంతెన కూడా గుర్తొస్తుంది పాత తరానికి...
బ్రిటీష్ హయాంలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించిన సర్ ఆర్ధర్ కాటన్, కేవలం బ్యారేజీ కట్టేసి ఊరుకోలేదు. ఆ బ్యారేజీ నుండి పంట పొలాలకు నీరందేందుకు అటు నుండి గోదావరి కాల్వను, ఇటు నుండి కృష్ణ నది నుండికాల్వను తవ్వించి కృష్ణా గోదావరి నదులను అనుసంధానం ఆ ఊరి శివార్లలో చేసేశారు. ఇది జరిగి నూట యాభై ఏళ్లయింది. అప్పట్లో హేలాపురిగా ప్రసిద్ధికెక్కిన ప్రస్తుత ఏలూరు నగరమే ఆ ఊరు. ఊరును ఒకటో పట్టణం , రెండోపట్టణంగా విడదీస్తూ కృష్ణ కాల్వ ప్రవహిస్తూంటుంది. అప్పట్లో కాల్వ లో నీరు ఎక్కువగా ఉండేది. రెండో పట్టణం నుండి ఒకటో పట్టణం వెళ్ళేందుకు వీలుగా కృష్ణ కాల్వ వద్ద ఏలూరు పవర్‌పేట వద్ద ఒక కర్రలతో నిర్మించిన వంతెన కట్టారు. దశాబ్దాలుగా ఈ కర్రవంతెన ప్రజలకు సేవలందించింది. కర్రవంతెన ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే అదున్న సెంటర్‌కు తన పేరే ఖాయం చేసేంతగా... ఆ తర్వాత వంతెనకు ఒకవైపు పళ్ళ దుకాణాలు వెలిశాయి. ఈ పళ్ళ దుకాణాలు ఉండడం వల్ల ఏలూరు జనం అంతా పండ్లు కావాలంటే,పూలు కావాలంటే కర్రవంతెన దగ్గరకు వచ్చే వారు. ఈ పండ్ల దుకాణాల కారణంగా కర్ర వంతెనను పళ్ళ వంతెన అని కూడా పిలిచే వారు. కర్రలతో ఉన్న ఈ వంతెన ను పాదచారులు, సైకిలిస్టులు మాత్రమే దాటేవారు. సైకిళ్లను చంకలో పెట్టుకుని మెట్లు ఎక్కి కర్రల మీదకు ఎక్కించి అదేవిధంగా కిందికి దించుకుంటూ సైకిలిస్టులు వెళ్ళేవారు. ఈ వంతెన దగ్గర కృష్ణ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండేది. కర్రల వంతెన పక్కన వార్ఫ్ ఉండేది. ఈ వార్ఫ్ దగ్గర పడవలు ఆగేవి. పడవల్లో వివిధ సామాన్లను ఎక్కించి అటు విజయవాడ వైపు, ఇటు రాజమండ్రి వైపు తీసుకువెళ్ళేవారు. కాలక్రమంలో కర్ర వంతెనకు వున్న కర్రలు విరిగిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడడంతో చెక్కలను తొలగించి కాంక్రీట్ వేసి సిమెంట్ వంతెన చేసేశారు. సిమెంట్ శ్లాబ్ వేసినా దాన్ని కర్రవంతెన అనే పిలిచేవారు. 1995 చివర్లో ఒక రాత్రి ఈ వంతెన శ్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో కొందరు వలస కూలీలు వంతెన చివర్లో నిలబడి కూలీ డబ్బులు పంచుకుంటున్నారు. ఆ సమయంలో శ్లాబ్ ఒకవైపు కూలిపోయి కాలవలోకి జారడంతో దానితోబాటు కూలీలూ జారి కాల్వలో పడ్డారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలూ కూడా తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత దాన్ని మరలా శ్లాబ్ వేసి రెడీ చేశారు. ఇన్ని సార్లు కూడా కర్రవంతెన తన పేరు నిలబెట్టుకుంది. తర్వాత 2006లో ఈ వంతెనను కార్లు వెళ్ళేవిధంగా డిజైన్ చేసి ఎట్టకేలకు పెద్ద వంతెనగా మార్పు చేశారు. ఇప్పుడు కర్రవంతెనకోసం వెతికే వారికి అది కనబడదు... కనీసం దాని ఆనవాళ్లు కూడా లేవు... కానీ సెంటర్ పేరు మాత్రం కర్రవంతెన సెంటర్‌గానే పిలుస్తుంటారు. వంతెన లేకపోయినా పేరును మాత్రం చిరస్థాయిగా నిలుపుకున్నది ఒక్క కర్ర వంతెన మాత్రమే... ఏలూరుకు ఓ మాన్యుమెంట్
1 comment:
చాలా చక్కగా చెప్పారు శర్మ....మీ నుండి మన ఏలూరు కి సంబందించిన పాత స్మృతులు పోస్ట్ చేయాల్సిందిగా మా కోరిక
Post a Comment