బతుకు వెంపర్లాట
బతుకుతున్నాం కాబట్టి వెంపర్లాడుతున్నాం బతుకు రహదారి ముళ్ళగానో సాఫీగానో కనపడుతోంది కాబట్టి నడిచేస్తున్నాం సుఖంగానో భారంగానో
కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అన్నది తెలిసి పుట్టినప్పుడూ పోయేటప్పుడూ ధారాపాతంగా నిన్ను నువ్వు తడిపేసుకోవడమో ఎదుటివారిని తడిపేయడమో చేసేస్తాం
ఆనందమో విషాదమో తెలిసే సరికి కట్టె మాట్లాడటమో నలుగురి భుజాలమీదుగా నిశ్చలంగా వెళ్ళడమో జరిగిపోతుంది....
ఈ మధ్య సమయంలో అహాలతో ఎగిరి పడుతూ పదిమందికీ దూరమవుతూ జీవిత చక్రాన్ని మనది చేసుకునేట్టు చూస్తాం... మనకి కానిదాన్ని పొందేందుకు కనబడని దేవుడికి పొర్లు దండాలెడతాం... అవసరమైతే లంచం ఇవ్వజూపుతాం.. ఎన్ని చేసినా వెంట వచ్చేది ఏముండదు... కనీసం నీ చితాభస్మం కూడా....
24.5.2015
Sunday, May 24, 2015
బతుకు వెంపర్లాట
Wednesday, January 21, 2015
ఓ ఆనందకర జ్ఞాపకం ... ఆత్మీయ కలయిక
ఇప్పటికి ఓ రెండు దశాబ్దాలు అవుతుంది . ఫోన్లోనో ఇమెయిల్ లోనో మాట్లాడుకోవడమే... నా చిన్నప్పుడు స్కూల్లో చేర్చేందుకు (నర్సరీ) మా బాబాయ్ కేశవ రామయ్య గారితో రావడం గుర్తు.. ఆ తర్వాత నన్ను ఎత్తుకోవడం , ఆడించడం గుర్తు. ఏలూరు సర్ సీఆర్ రెడ్డి కాలేజీలో రీడర్ గా చేస్తూ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమైనప్పటి దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది... గన్నవరం ఎయిర్ పోర్టు లో ఆయనకు వీడ్కోలు పలికేందుకు మా ఇంటిల్లిపాదీ వెళ్ళిన జ్ఞాపకం ...
1991లో మా తాతగారు గుండిమెడ శ్రీరాములు , మా బామ్మ గారు నాగరత్నమ్మ కాలం చేసినప్పుడు పరామర్శకు వచ్చారు...
ఆ తర్వాత ఇన్నేళ్ళకు ఏలూరు వచ్చిన మా మామయ్య గారు వెల్చేరు నారాయణ రావు ను ముఖాముఖి పలకరించి ఓ ఫొటో తీయగలిగాను... డిసెంబరు నెలాఖరులో మా తెలుగు టీచర్ మొక్కపాటి లలిత గారి ఇంట్లో ఇలా కెమెరా కు వెల్చేరు చిక్కారు....
Tuesday, November 18, 2014
పచ్చగా...
ఇదేమిటి ఇలా సయ్యాటలాడుతోంది... చిరుగాలి సవ్వడికి పరవశిస్తోంది... దీనికేమైందో...
వాళ్ళెవరో.. ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు... సయ్యాటలూ సవ్వడుల మధ్య వీళ్ళూ గొంతెత్తి పాడుతున్నారెందుకో... హలాల చేతులతో పొలాలు తడుముతూ పొంగిపోతారేమిటో?...
వీళ్ళకి ఏదో అయింది ... మట్టి పిసికి పిసికీ మెదళ్ళు వీళ్ళకి మొద్దుబారుతున్నాయి...
వీళ్ళ బతుకు మట్టవుతోంది...
ఒరేయ్ ఆ మట్టి వదిలెయ్ నీ బతుకుతో పాటూ ఒళ్ళూ చల్లబరుస్తా....
చచ్చాక దొరికే స్వర్గం కన్నా బెస్టయిన స్వర్గంలో నీకు చల్లటి సౌఖ్యాలు ఇప్పిస్తా...
అటుచూడు.. నవీన స్వర్గ నిర్మాతలొస్తున్నారు... నీ బతుకు బీమా బీరువాలో భద్రపరిచి నవీన సుఖాలు పొందాక అందిస్తా... నా మాట వినవూ ... పచ్చగా సుఖిస్తావు?
-- రామచంద్ర శర్మ గుండిమెడ
18/11/2014
Tuesday, October 14, 2014
HOPE
WALKING ON THE STREET OF DARKNESS ALONE,..
STRAY DOGS BARKING, NIGHT CREATURES CRIES LISTENING ON A SILENT DARKNESS...
NOTHING IS VISIBLE ... FOG JUST FORMING AROUND. I LISTEN MY HEART'S FAST BEAT,
LOOKING AROUND WITH A HOPE OF LIGHT
I MOVED FORWARD.
Monday, August 4, 2014
గుండె బరువు
సన్నదే ... మెల్లిగా పైనుండి జారుతోంది
బరువెక్కిన గుండెను ఊరడించుకునేందుకు ...
ఒక్కొక్కటీ పడుతూ చేసే ఆర్తనాదం
చిరు సవ్వడిగా వినిపించింది అందరికీ ...
నిన్నగాక మొన్నేగా తడిసి ముద్దయ్యారు?
మీ నిట్టూర్పులు వడగాలి హోరుకు నిశ్శబ్దం అయ్యాయి కదా.
ఇపుడు రోదించే హృదయం జార్చే చుక్క మీకు ఆనందపు జల్లయిందా.. మీ కాళ్ళ కింద నలుగుతూ చినుకు చిత్తడౌతోంది..
అందుకే అంబరానికి మీరంటే కోపం...
గుండె బరువు అలానే దాచుకుంది ఇన్నాళ్ళూ ...
Friday, June 13, 2014
సందేహం
ఓ అగ్ని గుండంలాంటి మధ్యాహ్నాన్ని దాటుకుంటూ సుడులు తిరుగుతూ వచ్చిన గాలినీ దానితోనే నేనూ అంటూ ఆనందమో విషాదమో తెలియని అవ్యక్త సాయంత్రం వేళ రెండు బొట్లు రాల్చి వెళ్ళింది... చల్లబడిందనుకున్న సాయంసమయం చీకటి మాటుకు జారుకుని రాత్రి జాగారం మిగిల్చి గాఢ నిద్రలోకి జారుకుంది... మండే కళ్ళకు ఉదయాన్నే నిప్పుల కొలిమి ఆహ్వానం పలుకుతోంది... వెళ్ళాలా మానాలా ఒకటే సందేహం ...
Saturday, March 15, 2014
అతిరథ మహారథుడు అనూరుండైన వైనం
ఆయనో చిన్న రాజు... అంచెలంచెలుగా రాజ్యాన్ని విస్తరించాడు... చుట్టూ బంధుమిత్ర సపరివారం వంధిమాగధులూ వెంట స్తోత్రపాఠాలతో కీర్తిస్తుండగా కీర్తనా మహిమతో తనను తాను అతిరథుడిగా భావించి పొంగిపొర్లుతున్న ఆనందం ఆపలేక కదనానికి కాలు దువ్వాడు... ఆయన అంగరంగ రాజ్యానికి బాసటగా వేలాది యోధులు తమ సర్వస్వం సమర్పించి ముందుకు ఉరికారు. ముందుగా శత్రు సైన్యం ఈయన మందీ మార్బలాన్ని చూసి ఈయన అతిరథ మహారథుడని నిదానించారు... భీకర యుద్ధంలో ఈ రథ శ్రేష్టుడైన రాజుగారికి ఊహించని పరాజయం ఎదురైంది . వెనుతిరిగి చూస్తే సకుటుంబం 18 మంది పరివారం మిగిలారు. ధనాగారం దెబ్బ తినకపోవడంతో ముందు ముందు రాజ్య విస్తరణ చేయాలని భావించినవాడై మిన్నకుండిపోయాడు. తాను ఈ స్థితికి రావడానికి కారణమైన మహారాణిని ముందు తిట్టుకునినూ తదుపరి రాణిగారి సామంతుడు పడుతున్న ఇబ్బంది చూసి మనసు నీరై తన అంగరంగ రాజ్యాన్ని మహా సామ్రాజ్యంలో కలిపేసి ఆనంద బాష్పాలు రాల్చాడు. అప్పటినుంచే కష్టం మొదలయ్యింది . రాజ్యం అప్పగించడంపై అలకలు మొదలయ్యాయి . ఈలోగా ఆయన పుట్టిన రాజ్యం రెండు చేయాలని రాణిగారు సంకల్పించారు. అంతకుముందు వరకూ అతిరథ మహారథుడైన రాజుగారు రాత్రికి రాత్రి అర్థరధుడయ్యాడు. ఆ స్థితిలో ఆయన్ని చూడలేని మహారాణి అంగరాజువి కాకున్నా నీవునూ మా సామంతరాజువే అని పట్టాభిషేకం జరిపించారు.తదనంతరం పుట్టిన రాజ్య విభజన మొదలైంది . నేను పుట్టానక్కడ విడదీయొద్దని చేసిన మొర విఫలం అయింది . అంగరాజు సామంతుడిగా ఊడిగం చేస్తూనే తన తప్పేం లేదని కన్నీరు పెట్టాడు ఎటూ కదలలేని స్థితికి చేరాడు. ఈలోగా యుద్ధ భేరి మోగింది . నీది ఎటూ కదలలేని స్థితి కావున సారధ్యం నీదేనని మహా రాణి భరోసా ఇచ్చింది. ఆనందంతో ముందడుగు వేసిన ఆయనకు రథ పగ్గాలు అప్పగించారు. నీ బాధ్యత రధం తోలుటయే అని రాణి వారు చెప్పారు .
అతిరథ మహారథుడైనఅంగరంగ రాజు చివరికి సర్వం పోయి కదలలేని స్థితిలో అనూరుడై రథం తోలుటలో శిక్షణ పొందుచున్నాడు
ఆయనో చిన్న రాజు... అంచెలంచెలుగా రాజ్యాన్ని విస్తరించాడు... చుట్టూ బంధుమిత్ర సపరివారం వంధిమాగధులూ వెంట స్తోత్రపాఠాలతో కీర్తిస్తుండగా కీర్తనా మహిమతో తనను తాను అతిరథుడిగా భావించి పొంగిపొర్లుతున్న ఆనందం ఆపలేక కదనానికి కాలు దువ్వాడు... ఆయన అంగరంగ రాజ్యానికి బాసటగా వేలాది యోధులు తమ సర్వస్వం సమర్పించి ముందుకు ఉరికారు. ముందుగా శత్రు సైన్యం ఈయన మందీ మార్బలాన్ని చూసి ఈయన అతిరథ మహారథుడని నిదానించారు... భీకర యుద్ధంలో ఈ రథ శ్రేష్టుడైన రాజుగారికి ఊహించని పరాజయం ఎదురైంది . వెనుతిరిగి చూస్తే సకుటుంబం 18 మంది పరివారం మిగిలారు. ధనాగారం దెబ్బ తినకపోవడంతో ముందు ముందు రాజ్య విస్తరణ చేయాలని భావించినవాడై మిన్నకుండిపోయాడు. తాను ఈ స్థితికి రావడానికి కారణమైన మహారాణిని ముందు తిట్టుకునినూ తదుపరి రాణిగారి సామంతుడు పడుతున్న ఇబ్బంది చూసి మనసు నీరై తన అంగరంగ రాజ్యాన్ని మహా సామ్రాజ్యంలో కలిపేసి ఆనంద బాష్పాలు రాల్చాడు. అప్పటినుంచే కష్టం మొదలయ్యింది . రాజ్యం అప్పగించడంపై అలకలు మొదలయ్యాయి . ఈలోగా ఆయన పుట్టిన రాజ్యం రెండు చేయాలని రాణిగారు సంకల్పించారు. అంతకుముందు వరకూ అతిరథ మహారథుడైన రాజుగారు రాత్రికి రాత్రి అర్థరధుడయ్యాడు. ఆ స్థితిలో ఆయన్ని చూడలేని మహారాణి అంగరాజువి కాకున్నా నీవునూ మా సామంతరాజువే అని పట్టాభిషేకం జరిపించారు.తదనంతరం పుట్టిన రాజ్య విభజన మొదలైంది . నేను పుట్టానక్కడ విడదీయొద్దని చేసిన మొర విఫలం అయింది . అంగరాజు సామంతుడిగా ఊడిగం చేస్తూనే తన తప్పేం లేదని కన్నీరు పెట్టాడు ఎటూ కదలలేని స్థితికి చేరాడు. ఈలోగా యుద్ధ భేరి మోగింది . నీది ఎటూ కదలలేని స్థితి కావున సారధ్యం నీదేనని మహా రాణి భరోసా ఇచ్చింది. ఆనందంతో ముందడుగు వేసిన ఆయనకు రథ పగ్గాలు అప్పగించారు. నీ బాధ్యత రధం తోలుటయే అని రాణి వారు చెప్పారు . అతిరథ మహారథుడైనఅంగరంగ రాజు చివరికి సర్వం పోయి కదలలేని స్థితిలో అనూరుడై రథం తోలుటలో శిక్షణ పొందుచున్నాడు.